ఒకే బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ.. ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు!

  • ముంబైపై కోల్‌కతా విజయంతో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు
  • నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ
  • రాజస్థాన్ రాయల్స్‌కు 50% అవకాశాలున్నాయన్న‌ స్టార్ స్పోర్ట్స్ 
  • మిగతా జట్ల క్వాలిఫికేషన్ నెట్ రన్ రేట్‌పై ఆధారపడే అవకాశం
ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. నిన్న‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో చివరిదైన నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం పోటీ తీవ్రమైంది. ఈ గెలుపుతో కోల్‌కతా తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానం కోసం ఏకంగా ఐదు జట్లు పోటీలో నిలిచాయి.

స్టార్ స్పోర్ట్స్ విశ్లేషణ ప్రకారం..
ప్రస్తుత సమీకరణాలను బట్టి, మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్ స్థానం కోసం పోటీ పడుతున్న జట్ల అవకాశాలపై స్టార్ స్పోర్ట్స్ ఒక విశ్లేషణను విడుదల చేసింది. దీని ప్రకారం, రాజస్థాన్ రాయల్స్‌కు (ఆర్ఆర్) ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు అత్యధికంగా 50 శాతం ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లకు చెరో 19 శాతం అవకాశాలుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అవకాశాలు 9 శాతంగా ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కేవలం 3 శాతం అవకాశాలతో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది.

ఏ జట్టు ఎలా క్వాలిఫై అవుతుంది?
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్): ఐదు జట్లలో రాజస్థాన్‌కే మంచి అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే చాలు 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడిపోతే, కేకేఆర్‌, పీబీకేఎస్, సీఎస్‌కే, డీసీ జట్లు తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాలని కోరుకోవాలి. ఆర్ఆర్ ఓడి, సీఎస్‌కే, డీసీ గెలిస్తే పాయింట్లు సమానమై నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్‌) కీలకం అవుతుంది.

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్): పంజాబ్ తమ చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అదే సమయంలో కేకేఆర్‌, ఆర్ఆర్ జట్లు ఓడిపోవాలి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే పంజాబ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆర్ఆర్ ఓడి, పంజాబ్, కోల్‌కతా రెండూ గెలిస్తే, మూడు జట్ల మధ్య నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌): పంజాబ్ తరహాలోనే కోల్‌కతా కూడా తమ చివరి మ్యాచ్‌లో గెలవాలి. అలాగే పంజాబ్, రాజస్థాన్ ఓడిపోవాలి. రాజస్థాన్ గెలిస్తే కేకేఆర్‌ కూడా ఇంటిముఖం పడుతుంది. ఒకవేళ పంజాబ్ గెలిస్తే, ఇరు జట్ల మధ్య పాయింట్లు సమానమై నెట్ రన్ రేట్ నిర్ణయాత్మకంగా మారుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ): ఢిల్లీ మార్గం అత్యంత కఠినమైనది. వారు తమ చివరి మ్యాచ్‌లో గెలవడమే కాకుండా, కేకేఆర్‌, పీబీకేఎస్, ఆర్ఆర్, సీఎస్‌కే జట్లన్నీ తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాలి. ఆర్ఆర్, పీబీకేఎస్, కేకేఆర్‌ లలో ఏ ఒక్క జట్టు గెలిచినా ఢిల్లీ అవకాశాలు ముగిసిపోతాయి. సీఎస్‌కే గెలిచిన పక్షంలో ఎన్ఆర్ఆర్‌ లెక్కలోకి వస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే): చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాలి. తమ చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడంతో పాటు కేకేఆర్‌, పీబీకేఎస్, డీసీ, ఆర్ఆర్ జట్లు ఓడిపోవాలి. ఒకవేళ కేకేఆర్‌, ఆర్ఆర్, పీబీకేఎస్ ఓడి, డీసీ గెలిస్తే, చెన్నై పాయింట్లు డీసీ, ఆర్ఆర్ లతో సమానమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఎవరిదో తేలుతుంది.

IPL 2026
Kolkata Knight Riders
Rajasthan Royals
Punjab Kings
Chennai Super Kings
Delhi Capitals
IPL Playoff Race
Star Sports Analysis
Net Run Rate
Cricket

More Telugu News